

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ గ్రౌండ్స్‌లో శ్రీకృష్ణ సదర్ సమ్మేళన్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సదర్ సమ్మేళనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవ సోదరులందరికీ సదర్ సమ్మేళన శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుక యాదవులకే పరిమితం కాదని, తెలంగాణ ప్రజలందరి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొన్నారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో యాదవుల పాత్ర ఎంతో కీలకమని, ఒకప్పుడు గోల్కొండ కోటను గొల్లంకొండగా పిలిచేవారని గుర్తుచేశారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం సదర్ సమ్మేళనాన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించిందని, వేడుకల నిర్వహణకు రూ.5 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. తెలంగాణలో కులగణన చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలిచామని అన్నారు.
తమ ప్రభుత్వం యాదవులకు తగిన రాజకీయ ప్రాధాన్యత కల్పించిందని సీఎం వెల్లడించారు. అనిల్ కుమార్ యాదవ్‌కు రాజ్యసభ సభ్యుడిగా, నవీన్ యాదవ్‌కు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించామని, ఈశ్వరమ్మ యాదవ్‌ను యాదగిరిగుట్ట బోర్డు సభ్యురాలిగా నియమించామని వివరించారు. యాదగిరిగుట్ట గోశాలలో గోవుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో యాదవులకు దక్కాల్సిన హక్కులు, వాటాలు కల్పించడంతో పాటు వారి ఆత్మగౌరవానికి ఎలాంటి లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. మూసీ అభివృద్ధి, మెట్రో విస్తరణ, భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం వంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లేందుకు యాదవుల సహకారం అవసరమని కోరారు.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!