

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'డ్రాగన్'. ఈ సినిమాకు సంబంధించి ప్రశాంత్ నీల్ తాజాగా ఒక కీలక అప్‌డేట్‌ను వెల్లడించాడు. 'కేజీఎఫ్', 'సలార్' వంటి చిత్రాలతో సంచలనం సృష్టించిన రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు ఆయన అధికారికంగా ధ్రువీకరించాడు.మంగళవారం ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ముచ్చటించిన ప్రశాంత్ నీల్, ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చాడు. 'డ్రాగన్' చిత్రానికి సంగీత దర్శకుడు ఎవరని అడగ్గా.. "ది వన్ అండ్ ఓన్లీ రవి బస్రూర్ సర్" అని ఆయన స్పష్టం చేశాడు. ఈ ప్రకటనతో ఈ భారీ ప్రాజెక్టుపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
ఇప్పటికే విడుదలైన 'డ్రాగన్ గ్లింప్స్' ప్రకారం, ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ, గోల్డెన్ ట్రయాంగిల్ మధ్య జరిగే అంతర్జాతీయ స్థాయి ఓపియం వార్ నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగనుంది. ఇందులో ఎన్టీఆర్ 'లూగర్/డ్రాగన్' అనే పవర్‌ఫుల్ కిల్లర్ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ నార్కోటిక్స్ బ్యూరో చీఫ్‌గా, మలయాళ నటుడు బిజూ మీనన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదల తేదీలో మార్పు చోటుచేసుకుంది. తొలుత ఈ ఏడాది జూన్ 25న విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం 2027 జూన్ 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్ గత ఏడాది ఏప్రిల్ నుంచే ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!