

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో కమిటీ కుర్రోళ్లు చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రం, ఉత్తమ మేకప్ విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు లభించడం పట్ల నిర్మాత ఫణి అడపాక హర్షం వ్యక్తం చేశారు. నిర్మాతగా తన ప్రయాణాన్ని సిద్ధార్థ్ రాయ్ చిత్రంతో ప్రారంభించానని, అనంతరం పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌తో కలిసి కమిటీ కుర్రోళ్లు వంటి మంచి కథ, బలమైన భావోద్వేగాలు కలిగిన చిత్రాన్ని నిర్మించే అవకాశం రావడం తన అదృష్టమని అన్నారు. ఈ చిత్రానికి జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం జీవితంలో మరచిపోలేని ఘట్టమని పేర్కొన్నారు.

ఈ విజయానికి కారణమైన దర్శకుడు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, చిత్ర బృందంలోని ప్రతి సభ్యుడికి ఫణి అడపాక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ సంస్థకు, విడుదలైన తొలి రోజు నుంచి చిత్రాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈటీవీ విన్‌తో కలిసి పలు ఆసక్తికరమైన ప్రాజెక్టులను రూపొందిస్తున్నామని, థియేటర్లతో పాటు ఓటీటీ వేదికల కోసం కూడా నాణ్యమైన కథలను అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. జాతీయ అవార్డులు తమపై మరింత బాధ్యతను పెంచాయని, భవిష్యత్తులోనూ కొత్త ప్రతిభను ప్రోత్సహించే మంచి సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ప్రేక్షకులను అలరిస్తామని తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!