

కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్‌కు 2024 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించింది. భారతీయ సినిమాకు, ముఖ్యంగా కన్నడ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారాన్ని ప్రకటించింది. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సినీ ప్రయాణాన్ని గౌరవిస్తూ ఈ అవార్డును అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 22, 2026న గుజరాత్‌లోని కేవడియాలో జరిగే 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా అనంత్ నాగ్ ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.
రంగస్థల కళాకారుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన అనంత్ నాగ్.. ‘సంకల్ప’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం కన్నడతో పాటు హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ, ఆంగ్ల భాషల్లో 300కు పైగా చిత్రాల్లో నటించారు. ‘మాల్గుడి డేస్’ వంటి దూరదర్శన్ కార్యక్రమాలతోనూ గుర్తింపు పొందారు. ‘ప్రేమలేఖలు’, ‘భీష్మ’ వంటి తెలుగు చిత్రాల్లో నటించిన ఆయన.. ‘కేజీఎఫ్: చాప్టర్ 1’లో ఆనంద్ ఇంగలగి పాత్రతో కొత్త తరం ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. 2025లో పద్మభూషణ్ అందుకున్న అనంత్ నాగ్‌కు తాజాగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించడం మరో కీలక గౌరవంగా నిలిచింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!