

ప్రకాశ్ రాజ్ ధర్మస్థల వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ధర్మస్థలలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతదేహాలను ఖననం చేశానని ప్రకటించుకున్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు చిన్నయ్య చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. ధర్మస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు రూ.200 కోట్ల కుట్ర జరిగిందని, ఆ విషయం తనకు తెలుసని చిన్నయ్య చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని తెలిపారు. తాను ఇప్పటివరకు ఒక్కసారి కూడా ధర్మస్థలకు వెళ్లలేదని, ఆలయానికి సంబంధించిన వారిని ఎప్పుడూ కలవలేదని బెంగళూరులో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
మాజీ పోలీసు అధికారి, ప్రస్తుతం తన సహచరుడైన గిరీశ్ మట్టణ్ణనవర్ ద్వారా చిన్నయ్యతో ఫోన్‌లో మాట్లాడినట్లు ప్రకాశ్ రాజ్ వెల్లడించారు. చిన్నయ్య తనను కలవాలని కోరినా తాను నిరాకరించానని, అతని ప్రవర్తన అనుమానాస్పదంగా అనిపించడంతో సిట్‌కు నేతృత్వం వహించిన ఐపీఎస్ అధికారి ప్రణబ్ మొహంతి కి సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ధర్మస్థల, సౌజన్య కేసులపై నిజానిజాలు వెలికితీయాలని తాను ఎప్పటి నుంచో కోరుతున్నానని చెప్పారు. అలాగే ‘అమ్ముడుబోయిన ప్రచార మాధ్యమాలు’ అనే తన వ్యాఖ్యలు మొత్తం మీడియాను ఉద్దేశించి కాదని, కొందరికే పరిమితమని స్పష్టం చేశారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!