

పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పులుల సంరక్షణ, నిర్వహణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేపట్టేందుకు ఐదుగురు సభ్యులతో హైపవర్డ్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశంలోనే అతిపెద్ద పులుల ఆవాసాలలో ఒకటైన నాగార్జునసాగర్–శ్రీశైలం టైగర్ రిజర్వ్‌లో ఇటీవల ఆడ పులి అనుమానాస్పద మృతి ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉప ముఖ్యమంత్రి, క్షేత్రస్థాయిలో సమీక్ష అవసరాన్ని గుర్తించారు. పులులు, వాటి ఆవాసాల సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కమిటీకి ఆదేశించారు.
రాష్ట్ర అటవీశాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి రాహుల్ పాండే, వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సభ్యుడు బి. రాజశేఖర్, టైగర్ సంరక్షణ సంఘం ప్రతినిధి ఇమ్రాన్ సిద్ధిఖీ, వన్యప్రాణి శాస్త్రవేత్త డాక్టర్ ఎం. నవీన్ కుమార్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. పులుల జనాభా, ఆవాసాలకు ఉన్న ముప్పులను అంచనా వేయడం, నివారణ వ్యూహాలు రూపొందించడం, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, సిబ్బంది సామర్థ్యాల పెంపు వంటి అంశాలపై సమగ్ర సిఫారసులు ఇవ్వాలని సూచించారు. పులుల సంరక్షణ, జీవవైవిధ్య రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!