

తెలుగులో కామెడీని చక్కగా హ్యాండిల్ చేయగల దర్శకుల్లో మారుతి ఒకరు. ఆయన తీసిన చాలా సినిమాలు ప్రేక్షకులను నవ్వించాయి. ముఖ్యంగా భలే భలే మగాడివోయ్ సినిమా మారుతికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్‌తో చేస్తున్న రాజాసాబ్ సినిమాతో కూడా కామెడీ బాగా వర్కవుట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు మారుతి మరో పెద్ద కలను బయటపెట్టారు. కామెడీని ఒక భాగంగా కాకుండా, పూర్తిగా కామెడీనే ప్రధానంగా పెట్టుకుని ఒక భారీ మల్టీస్టారర్ సినిమా తీయాలనేది ఆయన ఆశ. అందులో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌తో పాటు కమల్ హాసన్‌ను కూడా తీసుకుని పంచతంత్రం లాంటి సినిమా చేయాలని తన కోరిక అని ఓ పాడ్‌కాస్ట్‌లో చెప్పారు. అలాంటి సినిమా తీస్తే థియేటర్లు బ్లాస్ట్ అవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
కానీ ఈ ఆలోచన ఎంత బాగున్నా, అమలు చేయడం మాత్రం చాలా కష్టం. ఇప్పటికే ఇద్దరు సీనియర్ హీరోలతో సినిమా చేయడమే కష్టమవుతుంటే, నలుగురు తెలుగు స్టార్ హీరోలు, అదనంగా కమల్ హాసన్‌ను ఒకే సినిమాకు ఒప్పించడం దాదాపు అసాధ్యమే. అందుకే ఈ ప్రాజెక్ట్ మారుతి కలగానే మిగిలే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే హీరోలు ఎవరైనా సరే, మారుతి పంచతంత్రం తరహా పక్కా కామెడీ సినిమా తీస్తే మాత్రం ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అని చెప్పొచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!