

నటుడు విజయ్ హీరోగా నటించిన ‘జన నాయగన్’ సినిమా విడుదల మరోసారి వాయిదా పడే అవకాశాలున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెన్సార్ బోర్డు రివైజింగ్ కమిటీకి సినిమా పంపిన నేపథ్యంలో మార్చిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రచారం జరిగినప్పటికీ, తాజాగా కెనడాలో భారతీయ సినిమాలను విడుదల చేసే ‘యార్క్ సినిమాస్’ సంస్థ ప్రకటనతో కొత్త చర్చ మొదలైంది.
సదరు సంస్థ విడుదల చేసిన ప్రకటనలో ‘జన నాయగన్’ చిత్రం ఏప్రిల్ 30 లోపు విడుదల కాదని పేర్కొంది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న ప్రేక్షకులు సంబంధిత థియేటర్లను సంప్రదించాలని సూచించింది. దీంతో ఈ సినిమా మే నెలలో విడుదల కావచ్చని అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా విడుదల మరింత ఆలస్యం కావచ్చనే ప్రచారం కొనసాగుతోంది.
హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మొదట జనవరి 9న విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యల కారణంగా విడుదల వాయిదా పడింది. ఈ అంశం కోర్టుల వరకు వెళ్లిన తర్వాత నిర్మాతలు రిట్ పిటిషన్ను ఉపసంహరించుకుని సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించారు. ప్రస్తుతం కొత్త విడుదల తేదీపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!