

తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న యంగ్ హీరోయిన్ దుషారా విజయన్ ప్రస్తుతం మగుడం, సార్పట్టా-2 వంటి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి ఆమె ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. గత రెండేళ్లుగా ఓ మంచి వ్యక్తితో ప్రేమలో ఉన్నానని, ప్రస్తుతం తన జీవితం ఎంతో సంతోషంగా సాగుతోందని వెల్లడించారు. అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని స్పష్టం చేశారు. సినీ రంగంలో తాను ఎదిగేందుకు పడిన కష్టాలను చూసిన తన తల్లిదండ్రులు పెళ్లి విషయంలో తనపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదని తెలిపారు.
తన ప్రియుడు తన వృత్తిని, కెరీర్‌ను ఎంతో గౌరవిస్తూ నిరంతరం ప్రోత్సహిస్తారని, అలాంటి వ్యక్తి తన జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తున్నానని దుషారా చెప్పారు. తమ ఇద్దరికీ ప్రయాణాలు చేయడం ఇష్టమని, మొదటిసారి దుబాయ్‌లో కలుసుకున్నామని తెలిపారు. తన తండ్రి స్నేహితుడి ద్వారా పరిచయం ఏర్పడిన తర్వాత కారులో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో తనకు ఇష్టమైన ఇళయరాజా పాట వినిపించడంతో ఆశ్చర్యపోయానని చెప్పారు. తమ ఇద్దరి మధ్య అనుబంధానికి ఇళయరాజా సంగీతమే తొలి వారధిగా మారిందని దుషారా గుర్తుచేసుకున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!