

మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఇరుముడి చిత్రం విడుదల వాయిదా పడుతుందనే ప్రచారానికి చిత్రబృందం పూర్తి స్థాయిలో తెరదించింది. ముందుగా ప్రకటించినట్లుగానే ఆగస్టు 21న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ కొత్త పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. ఇటీవల విడుదల తేదీ మారే అవకాశాలపై సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరగగా, తాజా ప్రకటనతో ఆ సందేహాలకు ముగింపు లభించింది. దీంతో అభిమానులు మళ్లీ సినిమా విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విడుదలకు ఇంకా 25 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొంటూ విడుదల చేసిన పోస్టర్‌లో రవితేజతో పాటు బేబీ నక్షత్ర కనిపించడం ఆకట్టుకుంటోంది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌తో పాటు ఇరుముడి కట్టు పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. కుటుంబ భావోద్వేగాలను ప్రధానంగా తీసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తోంది. దర్శకుడు శివ నిర్వాణ రూపొందిస్తున్న ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు కూడా వేగంగా కొనసాగుతుండగా, విడుదల తేదీపై స్పష్టత రావడంతో చిత్రంపై అభిమానుల్లో ఉన్న ఉత్సాహం మరింత పెరిగింది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!