

తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న శ్రుతి హాసన్ గాయనిగా కూడా తన ప్రతిభను చాటుకున్నారు. ప్రస్తుతం ట్రైన్, ఆకాశంలో ఒక తార వంటి ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఆమె, తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ఆరంభం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్‌లను రూపొందించాలనే ఆసక్తి తనకు ఉండేదని, వాటి కోసం డబ్బు అవసరమవడంతో సినిమాల్లో నటించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో బాలీవుడ్ చిత్రం లక్‌లో నటించే అవకాశం రావడంతో వెంటనే అంగీకరించానని చెప్పారు. ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో నటన తన ప్రధాన వృత్తిగా మారిందని వివరించారు.
తన బాల్యంలోని తొలి నటనానుభవం గురించి కూడా శ్రుతి హాసన్ మాట్లాడారు. తండ్రి కమల్ హాసన్‌తో కలిసి షూటింగ్‌లకు వెళ్లే సమయంలో ఆయన దర్శకత్వం వహించిన హే రామ్ సినిమాలో నటించే అవకాశం వచ్చిందని గుర్తుచేసుకున్నారు. తండ్రి కోసమే ఆ చిత్రంలో నటించానని, అదే తనకు తొలి నటనానుభవమని తెలిపారు. తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సరిత వృత్తిపరమైన విషయాల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇచ్చేవారని పేర్కొన్నారు. సినీ రంగంలోకి అడుగుపెట్టడానికి డబ్బే ప్రధాన కారణమని ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!