

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సాన కాంబినేషన్లో తెరకెక్కిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పెద్ది’ జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విడుదల తర్వాత ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందనను అందుకుంది. రామ్ చరణ్ నటనకు ప్రశంసలు లభించినప్పటికీ, గ్రామీణ నేపథ్యం మరియు పాత్రల రూపకల్పనలో ఉన్న ప్రత్యేకతలు పాన్-ఇండియా ప్రేక్షకులకు పూర్తిస్థాయిలో కనెక్ట్ కాలేకపోయినట్లు కనిపిస్తోంది. విడుదలైన తొలి మూడు రోజులు మంచి వసూళ్లు సాధించిన సినిమా ఆ తర్వాత క్రమంగా మందగించింది.
తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ ప్రదర్శన ఆశాజనకంగా ఉన్నప్పటికీ, ఇతర భాషా మార్కెట్లలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.218 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ చిత్రం ఇప్పటివరకు అందులో సగం మేర మాత్రమే రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం వసూళ్లలో దాదాపు 80 శాతం తెలుగు రాష్ట్రాల నుంచే రావడం విశేషం. ఓవర్సీస్, బాలీవుడ్ మార్కెట్లలో సినిమా నిరాశపరిచినట్లు తెలుస్తోంది. తమిళనాడు, కేరళలో థియేట్రికల్ రన్ ముగింపు దశకు చేరుకోగా, కర్ణాటకలోనూ నష్టాలు తప్పవని అంచనా వేస్తున్నారు. మరోవైపు నైజాం ప్రాంతంలో మంచి వసూళ్లు నమోదు అవుతుండగా, వైజాగ్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ప్రాంతాలు బ్రేక్ ఈవెన్‌కు చేరువలో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!