

ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో నేరుగా విడుదలయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌లకు కూడా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి ముందస్తు సర్టిఫికేషన్ తప్పనిసరి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) చట్టంలో సవరణలు తీసుకురావాలని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. పంజాబీ చిత్రం సత్లుజ్ చుట్టూ నెలకొన్న వివాదం అనంతరం ఈ అంశంపై చర్చలు వేగం పుంజుకున్నాయి. ముఖ్యంగా అభ్యంతరకర సన్నివేశాలు, సున్నితమైన అంశాలు, ప్రజా శాంతి భద్రతపై ప్రభావం చూపే కంటెంట్ విషయంలో నియంత్రణను మరింత కట్టుదిట్టం చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
మానవ హక్కుల కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవిత కథ ఆధారంగా రూపొందిన సత్లుజ్ చిత్రం జూలై 3న ZEE5లో విడుదలై, 48 గంటల్లోనే భారత్‌లో ప్లాట్‌ఫారమ్ నుంచి తొలగించబడింది. ఈ చిత్రం తొలుత Punjab 95 పేరుతో సీబీఎఫ్‌సీకి వెళ్లగా, అనేక కట్స్ సూచించబడినట్లు సమాచారం. అనంతరం టైటిల్ మార్చి నేరుగా ఓటీటీలో విడుదల చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో థియేటర్లలోనే కాకుండా ఓటీటీలో విడుదలయ్యే ప్రతి చిత్రానికి కూడా సీబీఎఫ్‌సీ అనుమతి తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇదే సమయంలో ఈ అంశం పంజాబ్ రాజకీయాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!