

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘జన నాయగన్’ విడుదలకు ఇంకా రెండు రోజులు మాత్రమే ఉండగా సెన్సార్ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాకు ఇప్పటివరకు సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకపోవడంపై కేంద్ర సెన్సార్ బోర్డు వివరణ ఇవ్వాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా ఈ నెల 9 న విడుదల కావాల్సి ఉంది. నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్ ఇప్పటికే విడుదలకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసింది.
గత డిసెంబరులో సినిమాను సెన్సార్‌కు పంపినప్పుడు కొన్ని సన్నివేశాలు తొలగించాలని, కొన్ని సంభాషణలను మ్యూట్ చేయాలని సూచనలు వచ్చినట్లు సమాచారం. వాటిని అమలు చేసిన తర్వాత మళ్లీ సెన్సార్‌కు పంపినా ఇప్పటివరకు బోర్డు నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కేవీఎన్ ప్రొడక్షన్ తరఫున మద్రాస్ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలైంది.
సినిమాపై ఫిర్యాదు రావడంతో కొత్త కమిటీ సినిమా చూడాల్సి ఉంటుందని, అందుకు సమయం కావాలని సెన్సార్ బోర్డు తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. అయితే విడుదలకు చాలా తక్కువ సమయం మాత్రమే ఉందని, కొత్త కమిటీ అవసరం లేదని నిర్మాతల తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ విషయంపై కేంద్ర సెన్సార్ బోర్డు సమాధానం ఇవ్వాలని ఆదేశించిన న్యాయమూర్తి, తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.




.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!