

పర్యావరణ హిత దీపావళిపై నటి దియా మీర్జా రూపొందించిన అవగాహన వీడియోను తిరిగి అప్‌లోడ్ చేయాలని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)ని బాంబే హైకోర్టు ఆదేశించింది. కొందరు రాజకీయ నాయకులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సోమవారం బీఎంసీ తన సామాజిక మాధ్యమాల ఖాతాల నుంచి ఆ వీడియోను తొలగించింది. గాలి, శబ్ద కాలుష్యానికి సంబంధించిన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ గిరీష్ కులకర్ణి, జస్టిస్ నీలా గోఖలేలతో కూడిన ధర్మాసనం ఈ వివాదంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పర్యావరణ పరిరక్షణ, బాణసంచా వల్ల కలిగే కాలుష్యంపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించిన వీడియోకు అనవసరమైన రంగులు పులమడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. అవగాహన కార్యక్రమం కోసం ప్రముఖులను ఎంపిక చేయాలన్న బీఎంసీ కమిషనర్ నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
పర్యావరణ పరిరక్షణకు మతం, కులం, వర్గంతో ఎలాంటి సంబంధం లేదని, ప్రతి ఒక్కరూ పీల్చేది ఒకే గాలి అని ధర్మాసనం స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని, మతం, కులం, నేపథ్యంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించాలని రాజ్యాంగం ఆశిస్తోందని గుర్తుచేసింది. ముంబయి నగరం ప్రజల ఐక్యత, సమాజం పట్ల ఉన్న అనుబంధంతోనే మనుగడ సాగిస్తోందని, బాధ్యతారహిత వ్యాఖ్యల వల్ల ఆ ఐక్యతకు భంగం కలగకూడదని పేర్కొంది. బాణసంచా వినియోగం, కాలుష్య నియంత్రణపై న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలు కేవలం దీపావళికి మాత్రమే పరిమితం కావని, ఏడాది పొడవునా గాలి, శబ్ద కాలుష్య నియంత్రణకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో దియా మీర్జా వీడియోను తిరిగి అప్‌లోడ్ చేయాలని బీఎంసీని ఆదేశించింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!