

సీపీఎం సీనియర్ నేత, అఖిల భారత కిసాన్ సభ (AIKS) ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. వయోభారంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తడంతో కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుంచి వైద్యులు చికిత్స అందించారు. ఆదివారం అర్ధరాత్రి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో వైద్యులు అత్యవసర చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజామున 3.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
మల్లారెడ్డికి భార్య భాగ్యలక్ష్మి, కుమారులు వాసుదేవ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, కుమార్తె సునీత ఉన్నారు. అనారోగ్య కారణాలతో ఆయన పెద్ద కుమార్తె అనిత ఇటీవలే మృతి చెందారు. మల్లారెడ్డి మృతదేహాన్ని నిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి. సాగర్, కేవీపీఎస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు బాబురావు తదితరులు ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. మల్లారెడ్డి మృతిపై పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటని సంతాపం తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!