

మన దేశంలో జుట్టు సంరక్షణకు తరతరాలుగా కొబ్బరి నూనె, ఆవాల నూనె ప్రధానంగా వాడుతున్నారు. నూనె రాయడమే కాకుండా తలకు మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగై జుట్టు కుదుళ్లు బలపడతాయి. అయితే జుట్టు పెరుగుదలకు ఏ నూనె మంచిదన్న ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఇప్పుడు దీనిపై స్పష్టంగా చూద్దాం.
కొబ్బరి నూనెను మన పెద్దలు ఎప్పటి నుంచో నమ్మకంగా ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే లారిక్ యాసిడ్, ఫ్యాటీ యాసిడ్లు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి ప్రోటీన్ నష్టాన్ని తగ్గిస్తాయి. పొడి, దెబ్బతిన్న జుట్టు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. జుట్టుకు మెరుపు ఇవ్వడమే కాకుండా తలలో మంట, దురదను తగ్గిస్తుంది. గోరువెచ్చని కొబ్బరి నూనెలో కొద్దిగా ఆముదం కలిపి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఆవాల నూనెలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ E, జింక్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది తల చర్మంలో రక్త ప్రసరణను పెంచి జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. కాలుష్యం, ఒత్తిడి వల్ల జుట్టు రాలే సమస్య ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది. ఇందులోని యాంటీబాక్టీరియల్ లక్షణాలు చుండ్రు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఆవాల నూనెలో కరివేపాకులు వేసి వేడి చేసి వాడితే జుట్టు బలంగా, నల్లగా పెరుగుతుంది.
మొత్తంగా చూస్తే, జుట్టు పెరుగుదలను వేగవంతం చేయాలంటే ఆవాల నూనె మంచిది. తలలో దురద, మంట లేదా పొడి జుట్టు సమస్యలు ఉంటే కొబ్బరి నూనె ఉత్తమ ఎంపిక. అయితే ప్రతి ఒక్కరి జుట్టు తత్వం భిన్నంగా ఉంటుంది కాబట్టి, మీ అవసరానికి అనుగుణంగా నూనెను ఎంచుకోవడం ముఖ్యం. ఏ నూనె అయినా గోరువెచ్చగా చేసి 10–15 నిమిషాలు మసాజ్ చేయాలి. మసాజ్ చేసిన గంట తర్వాత మైల్డ్ షాంపూతో స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా, దట్టంగా పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!