

గత కొంతకాలంగా “బ్లడ్ ఇన్ఫెక్షన్” అనే పదం తరచుగా వింటున్నాం. ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా డాక్టర్లు కూడా ముందుగా ఇదే చెబుతున్నారు. కానీ నిజంగా బ్లడ్ ఇన్ఫెక్షన్ కేసులు పెరుగుతున్నాయా? పెరిగితే దానికి గల కారణాలేంటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
మన శరీరంలోని అన్ని అవయవాల్లాగే రక్తానికి కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది. దాన్ని వైద్య భాషలో సెప్సిస్ (Sepsis) అంటారు. ఇది ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో, మధుమేహంతో బాధపడేవారిలో, మద్యపానం ఎక్కువగా చేసేవారిలో, కాలేయం లేదా కేన్సర్ సమస్యలతో ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది.
బ్లడ్ ఇన్ఫెక్షన్ మూడు రకాలుగా ఉంటుంది – మైల్డ్, మోడరేట్, సీవియర్.
మైల్డ్ లేదా మోడరేట్ దశలో యాంటీబయోటిక్స్ లేదా ఇంట్రావీనస్ ఇంజెక్షన్లతో చికిత్స సాధ్యమవుతుంది. కానీ సీవియర్ దశలో రక్తపోటు తగ్గడం, శరీర అవయవాలు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.
పుట్టిన పిల్లల్లో రోగనిరోధక శక్తి ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందకపోవడంతో, చర్మం లేదా పేగుల్లో వచ్చే ఇన్ఫెక్షన్లు రక్తంలోకి చొరబడే అవకాశం ఉంటుంది. తల్లిపాలు తక్కువగా తీసుకునే లేదా సరిగ్గా ఆహారం తీసుకోని పిల్లల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాగే పెద్దవారిలో షుగర్, బీపీ, గుండె, కిడ్నీ వంటి సమస్యలు ఉన్నవారికి కూడా ఇది వచ్చే అవకాశం ఉంది.
డయేరియా లేదా దీర్ఘకాలిక జ్వరం వచ్చినప్పుడు కూడా రక్తంలో బ్యాక్టీరియా చొరబడే ప్రమాదం ఉంటుంది. రెండు లేదా మూడు రోజులకు మించిన జ్వరం తగ్గకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
అయితే, కొన్ని సందర్భాల్లో చిన్న ఇన్ఫెక్షన్లకే కూడా “బ్లడ్ ఇన్ఫెక్షన్” అని చెప్పే వారు ఉన్నారని వైద్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి తగిన పరీక్షలు, సరైన నిర్ధారణ, మరియు సమయానికి చికిత్స చాలా ముఖ్యం.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!