

చదివిన విషయాలను గుర్తుంచుకోవడానికి అనేక ఉపాయాలు అవసరం లేదని, కేవలం సరైన సమయంలో చేసే వ్యాయామం సరిపోతుందని పరిశోధనలు తేల్చాయి. ముఖ్యంగా, చదువు పూర్తయిన 3 నుండి 4 గంటల తర్వాత వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి గణనీయంగా పెరుగుతుంది. ఈ సమయంలో వ్యాయామం చేసినప్పుడు మెదడులో BNDF అనే కీలక ప్రోటీన్ విడుదల అవుతుంది.
చాలా మంది విద్యార్థులకు చదివిన పాఠాలు గుర్తుంచుకోవడం ఒక పెద్ద సవాల్. ఎంత కష్టపడి చదివినా, క్షణాల్లోనే మర్చిపోవడం తల్లిదండ్రులకు మరియు పిల్లలకు ఆందోళన కలిగిస్తుంది. ఈ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తెల్లవారుజామున 4 గంటలకు పిల్లలను నిద్రలేపి చదివించడం వంటి ఒత్తిడితో కూడిన పద్ధతులను అనుసరిస్తున్నారు. అయితే చదివిన వాటిని గుర్తుంచుకోవడానికి ఇంత ఒత్తిడి అవసరం లేదని, కేవలం వ్యాయామం సరిపోతుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
నిపుణులు నిర్వహించిన పరిశోధనలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది. చదివిన వెంటనే కాకుండా, చదివిన లేదా అధ్యయనం చేసిన నాలుగు గంటల తర్వాత శారీరక వ్యాయామం చేయడం వల్ల జ్ఞాపకశక్తి నిలుపుదల గణనీయంగా మెరుగుపడుతుంది.
‘కరెంట్ బయాలజీ’ జర్నల్లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం, మనం ఏదైనా కొత్త విషయం నేర్చుకున్నప్పుడు మెదడులో ఆ సమాచారం చిన్న గుర్తులా ఏర్పడుతుంది. ఈ గుర్తు బలపడటానికి కొన్ని గంటలు పడుతుంది.
చదివిన వెంటనే వ్యాయామం చేస్తే అంత ప్రయోజనం ఉండదు, ఎందుకంటే ఆ సమయంలో మెదడు సమాచారాన్ని సర్దుబాటు చేసే పనిలో ఉంటుంది. కానీ చదివిన 3 లేదా 4 గంటల తర్వాత వ్యాయామం చేస్తే, అది మెదడుకు పవర్ఫుల్ బూస్టర్లా పనిచేస్తుంది.
వ్యాయామం వల్ల ఆక్సిజన్ ఎక్కువగా ఉన్న రక్తం మెదడుకు చేరుతుంది. ఇది మెదడులోని ముఖ్యమైన సమాచారాన్ని పక్కాగా ‘సేవ్’ చేయడానికి సహాయపడుతుంది.
వ్యాయామం చేసినప్పుడు మెదడులో BNDF (Brain-Derived Neurotrophic Factor) అనే ప్రత్యేకమైన ప్రోటీన్ విడుదల అవుతుంది. ఈ ప్రోటీన్ కొత్త నరాలు పెరగడానికి, ఉన్న నరాలు బలపడడానికి సహాయపడుతుంది. జ్ఞాపకాలను నిల్వ చేసే మెదడు భాగం బలంగా మారుతుంది.
చదువు లేదా ఏదైనా కొత్త నైపుణ్యం నేర్చుకున్న తర్వాత 3 నుండి 4 గంటలు విరామం తీసుకోండి.
తరువాత 20 నుండి 30 నిమిషాలు చురుకుగా నడవండి, జాగింగ్ చేయండి లేదా సైక్లింగ్ చేయండి.
ఇలా చేయడం వల్ల శరీరం బలంగా అవ్వడంతో పాటు, చదివిన విషయాలు ఎక్కువ కాలం గుర్తుంటాయి.







.jpg&w=3840&q=75)




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!