

వేసవి కాలంలో శరీరాన్ని తేమగా, తాజాగా ఉంచేందుకు ఆరోగ్యకరమైన పండ్లను ఎక్కువగా తీసుకోవడం సాధారణం. అలాంటి జ్యూసీ పండ్లలో ద్రాక్ష ఒక ముఖ్యమైనది. నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో లభించే ద్రాక్షలు తీపిగా, రుచికరంగా ఉండటమే కాకుండా పోషకాలతో సమృద్ధిగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా రెస్వెరాట్రాల్ వంటి యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్, ప్రోటీన్, ఐరన్, కాపర్, ఫోలేట్, విటమిన్లు C, A, K, B వంటి అనేక పోషకాలు ద్రాక్షలో లభిస్తాయి. అందుకే వీటిని రెగ్యులర్‌గా తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు.
ద్రాక్ష రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ C, విటమిన్ B6, ఐరన్ వంటి పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని అందించి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి. అలాగే ద్రాక్షలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచి మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. విటమిన్లు, మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, రాగి వంటి పోషకాలు శరీరానికి శక్తిని అందించి అలసటను తగ్గిస్తాయి.
ద్రాక్ష కంటి ఆరోగ్యానికి, గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులోని పాలిఫెనాల్స్, రెస్వెరాట్రాల్ వంటి పదార్థాలు కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా దోహదపడతాయి. ఎముకలను బలపరచడంలో, గుండె జబ్బుల నుంచి రక్షణ కల్పించడంలో ద్రాక్షలోని పోషకాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వల్ల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి. అందువల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ద్రాక్షలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య సలహా, నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదురైతే వెంటనే అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించండి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!