మన వంటింట్లో నిత్యం ఉపయోగించే దినుసుల్లో మెంతులు ఒకటి. వంటలకు రుచిని అందించడమే కాకుండా, మెంతుల్లో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయని చాలామందికి తెలియదు. ముఖ్యంగా మహిళల ఆరోగ్యానికి మెంతులు ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని సరైన విధానంలో రోజూ తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణుల సూచన. ముఖ్యంగా ఉదయాన్నే పరగడుపున మెంతుల నీరు తాగితే శరీరానికి విశేష లాభాలు కలుగుతాయని డైటీషియన్లు చెబుతున్నారు. ఫైబర్, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్, పొటాషియం వంటి కీలక పోషకాలతో నిండిన మెంతుల నీరు జీర్ణశక్తిని మెరుగుపరచి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి, బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
మెంతులు, మెంతుల నీరు బాలింతలలో తల్లిపాలు పెరగడానికి ఎంతో ఉపకరిస్తాయి. మెంతికూరను ఆహారంలో చేర్చడం లేదా మెంతులతో చేసిన దోసెలు, ఇడ్లీలు తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి మెరుగవుతుంది. అలాగే గర్భధారణ సమయంలో ప్రసవాన్ని సులభతరం చేయడం, గర్భాశయానికి సంబంధించిన సమస్యలను తగ్గించడం వంటి ప్రయోజనాలు కూడా మెంతుల వల్ల కలుగుతాయి. ప్రసవం తర్వాత పేగుల కదలికను మెరుగుపరచి, నడుము నొప్పి వంటి సమస్యలను తగ్గించడంలోనూ ఇవి ఉపయోగపడతాయి.
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు రోజుకు 10–20 గ్రాముల మెంతులను నీటిలో లేదా మజ్జిగలో కలిపి తీసుకుంటే కొవ్వు తగ్గి బరువు నియంత్రణలో ఉంటుంది. మధుమేహం ఉన్నవారికి మెంతులు అద్భుతమైన సహజ ఔషధం. ప్రతిరోజూ ఒక టీస్పూన్ మెంతి పొడిని తీసుకోవడం లేదా నానబెట్టిన మెంతులను నీటితో సేవించడం ద్వారా డయాబెటిస్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. అలాగే మలబద్ధకం సమస్య ఉన్నవారు 2–3 చెంచాల నానబెట్టిన మెంతులను తింటే విరేచనం సాఫీగా అవుతుంది. జ్వరం, గొంతునొప్పి తగ్గించేందుకు మెంతులు, తేనె, నిమ్మరసం కలిపిన కషాయం ఉపశమనాన్ని ఇస్తుంది. ఈ విధంగా మెంతులు మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. వాటిని సరైన రీతిలో దినచర్యలో భాగం చేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆరోగ్యకరమైన జీవనం కోసం రాత్రి మెంతులను నానబెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగడం, మెంతులను నమలడం, మెంతి పొడిని మరిగించి తీసుకోవడం లేదా మెంతికూరను ఆహారంలో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.












.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!