

చలికాలం మొదలైతే తెల్లవారుజామున నడవడం సురక్షితమేనా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఉదయం సమయంలో రక్త ప్రవాహం కొంత నెమ్మదిగా ఉండడం వల్ల చల్లటి గాలిలో నడక హానికరమా అని చాలామంది ఆలోచిస్తారు. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన జాగ్రత్తలు తీసుకుంటే చలికాలంలో మార్నింగ్ వాక్ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
నడక శరీరానికి అనేక రకాలుగా సహాయపడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో, కండరాలను బలపరచడంలో, శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే గుండె మరియు ఊపిరితిత్తుల పనితీరును బలోపేతం చేసి గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గిస్తుంది. ఉదయపు తేలికపాటి సూర్యకాంతి ద్వారా విటమిన్ డి లభించడం ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం.
అదేవిధంగా, నడక చేయకుండా నిశ్చల జీవనశైలిని కొనసాగిస్తే ఊబకాయం, అధిక బరువు, చక్కెర సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ. కండరాల బలహీనత, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం వంటి వాటి ప్రమాదం కూడా ఉంటుంది.
ఉదయం చల్లని వాతావరణంలో నడక సాధారణంగా మేలు చేస్తుంది. అయితే ఉబ్బసం, అధిక రక్తపోటు, గుండె వ్యాధులు ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలి. వెచ్చని దుస్తులు లేకుండా బయటికి రావడం లేదా వార్మప్ చేయకపోవడం కండరాల గాయాలు లేదా జలుబుకు దారితీయవచ్చు. అందువల్ల శరీరం పూర్తిగా అలవాటు పడే సమయాల్లో, ఉదయం కొంచెం ఆలస్యంగా లేదా మధ్యాహ్నం సమయంలో నడకను ఎంచుకోవడం మంచిది.
వెచ్చని దుస్తులు తప్పనిసరిగా ధరించాలి. ముఖ్యంగా చేతులు, కాళ్లు చలికి గురి కాకుండా కప్పుకోవాలి. నడకకు ముందుగా తప్పక వార్మప్ చేయాలి, తద్వారా కండరాలకు గాయాలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. మొదట 10-15 నిమిషాలు నెమ్మదిగా ప్రారంభించి, తర్వాత వేగాన్ని పెంచాలి. అవసరమైతే మాస్క్ ఉపయోగించి చల్లటి గాలిని తగ్గించుకోవచ్చు. నడక సమయంలో నీరు త్రాగడం మర్చిపోవద్దు.
NOTE:
ఇవి కేవలం అవగాహన కోసమే. మీ ఆరోగ్య సమస్యలను బట్టి మార్పులు ఉండొచ్చు. అనుమానాలు ఉంటే తప్పనిసరిగా వైద్యులను సంప్రదించండి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!