

ఉదయం, రాత్రి వేళల్లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. చల్లని గాలులు, ఉష్ణోగ్రతల్లో మార్పుల కారణంగా చాలామంది జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. చల్లని వాతావరణం నేరుగా వైరల్ ఇన్ఫెక్షన్లకు కారణం కాకపోయినా.. ఎక్కువసేపు గదుల్లోనే ఉండటం, గాలి ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల వైరస్లు వ్యాపించే అవకాశం పెరుగుతుంది. వాతావరణానికి తగిన దుస్తులు ధరించకపోవడం, నీరు తక్కువగా తాగడం, చేతుల పరిశుభ్రత పాటించకపోవడం, గదుల్లోకి స్వచ్ఛమైన గాలి రాకుండా చూడటం వంటి అలవాట్లు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. అలాగే తగినంత నిద్ర లేకపోవడం, పోషకాహారం తీసుకోకపోవడం, అనారోగ్య లక్షణాలను నిర్లక్ష్యం చేయడం కూడా శరీర రోగనిరోధక పనితీరుపై ప్రభావం చూపవచ్చు.
మెడ్ఫస్ట్ ఈఎన్టీ సెంటర్ కన్సల్టెంట్ డాక్టర్ (మేజర్) రాజేష్ భరద్వాజ్ సూచనల ప్రకారం.. చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. బయటకు వెళ్లేటప్పుడు వెచ్చని దుస్తులు ధరించాలి, రోజంతా తగినంత నీరు, ఇతర ద్రవాలు తీసుకోవాలి. బయట నుంచి వచ్చిన తర్వాత చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. వీలైనప్పుడు గదుల్లోకి స్వచ్ఛమైన గాలి వచ్చేలా చూసుకోవాలి. జలుబు, దగ్గు వచ్చిన ప్రతిసారీ వైద్యుల సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ముఖ్యంగా ఆస్తమా, సీఓపీడీ, గుండె సంబంధిత సమస్యలు, రోగనిరోధక శక్తి తగ్గినవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతినొప్పి, అధిక జ్వరం లేదా లక్షణాలు తీవ్రంగా మారితే వెంటనే వైద్య సహాయం పొందాలి. అవసరమైన టీకాలను వైద్యుల సూచన మేరకు వేయించుకోవడం కూడా ఇన్ఫెక్షన్ల ముప్పును తగ్గించడంలో సహాయపడుతుంది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!