భారతీయుల దైనందిన జీవనశైలిలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. చాలా మందికి ఉదయం లేవగానే ఒక కప్పు టీ తాగితేనే రోజు మొదలైనట్టుగా అనిపిస్తుంది. ఉదయం మాత్రమే కాకుండా 10–11 గంటల సమయంలో, సాయంత్రం, కొందరైతే రాత్రి కూడా టీ తాగడం అలవాటుగా మారింది. ఇంకా కొంతమంది రెండు మూడు గంటలకు ఒకసారి ఛాయ్ తాగుతూ ఉంటారు. అయితే, టీని ప్రతిసారి, ప్రతీ సమయంలో తాగడం ఆరోగ్యానికి మంచిదేనా అన్న ప్రశ్నకు నిపుణులు మాత్రం “అవసరం లేదు” అనే సమాధానం ఇస్తున్నారు. ప్రత్యేకంగా భోజనం చేసిన వెంటనే టీ తాగడం ఆరోగ్యానికి హానికరమని వైద్యులు, న్యూట్రిషన్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం పడటమే కాకుండా, శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాల శోషణకు అడ్డంకులు ఏర్పడతాయని చెబుతున్నారు.
టీలో ఉండే టానిన్స్, పాలిఫెనోల్స్ వంటి రసాయనాలు రక్తంలో ఐరన్ శోషణను తగ్గిస్తాయి. ముఖ్యంగా ఆకుకూరలు, పప్పులు, పెసర వంటి ఆహార పదార్థాల ద్వారా లభించే ఐరన్‌పై వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి కావాల్సిన ఐరన్ సరైన మోతాదులో అందకపోవచ్చు. ఫలితంగా అలసట, నీరసం, భారంగా అనిపించడం, రక్తహీనత (అనీమియా) వంటి సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. పరిశోధనల ప్రకారం, భోజనం తిన్న వెంటనే టీ తాగితే ఐరన్ శోషణ సగానికి పైగా తగ్గే అవకాశం ఉందని వెల్లడైంది. అదేవిధంగా, భోజనం తరువాత వెంటనే టీ తీసుకోవడం జీర్ణక్రియను మందగిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసే రసాలు, ఎంజైమ్స్ సరిగా పనిచేయకపోవడంతో తిన్న ఆహారం జీర్ణం కావడంలో ఆలస్యం జరుగుతుంది. దీని వల్ల గ్యాస్, పొట్ట ఉబ్బరం, అసౌకర్యం, భారంగా అనిపించడం వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఇక టీలో ఉండే కాఫైన్, టానిన్స్ స్టమక్‌లో ఆమ్లతను పెంచుతాయి. దీని కారణంగా యాసిడిటీ, హార్ట్‌బర్న్, యాసిడ్ రిఫ్లక్స్ వంటి సమస్యలు ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గ్యాస్ లేదా యాసిడిటీ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే, భోజనం తర్వాత టీ పూర్తిగా మానేయాలా అంటే అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కనీసం 30 నిమిషాల నుంచి 60 నిమిషాల విరామం ఇచ్చి టీ తాగితే పెద్దగా సమస్య ఉండదని సూచిస్తున్నారు. ఈ సమయంలో ఐరన్ వంటి పోషకాలు శరీరంలో సరైన విధంగా శోషించబడతాయి. అలాగే, కాఫైన్ లేని హర్బల్ టీలైన చమోమిల్, పుదీనా, అల్లం టీ లాంటివి తక్కువ ప్రభావం చూపుతాయి. ఇవి భోజనం మధ్యలో లేదా తినడానికి ముందు తీసుకోవచ్చు. అయితే సాధారణ పాల టీ లేదా బ్లాక్ టీని మాత్రం భోజనం చేసిన వెంటనే కాకుండా కనీసం అరగంట తర్వాత తీసుకోవడం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.























కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!