

నేటి వేగవంతమైన జీవితశైలిలో ప్రజలు తినడాన్ని కూడా తొందరగా ముగించేందుకు అలవాటు పడుతున్నారు. ఆఫీసు పనులు, మొబైల్ వినియోగం, సమయాభావం వంటి కారణాల వల్ల చాలామంది శ్రద్ధ లేకుండా, స్క్రీన్ చూస్తూ భోజనం చేస్తున్నారు. ఈ అలవాటు ఆహారం తీసుకునే పరిమాణం, నాణ్యత రెండింటినీ ప్రభావితం చేస్తుంది. చాలా వేగంగా తినడం వల్ల శరీరానికి కడుపు నిండినట్లు సరైన సంకేతం అందకపోవడం వల్ల అతిగా తినే ప్రమాదం పెరుగుతుంది. దీంతో ఊబకాయం వచ్చే అవకాశాలు అధికమవుతాయి. అలాగే ఈ అలవాటు జీర్ణక్రియను దెబ్బతీసి మలబద్ధకం, కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు దారితీస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అదనంగా, ఇన్సులిన్ స్థాయిల్లో మార్పులు రావడం వల్ల టైప్ 2 మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.
ఈ సమస్యలను నివారించాలంటే తినేటప్పుడు ఓర్పుతో, ఏకాగ్రతతో ఉండడం చాలా ముఖ్యం. ఆహారాన్ని బాగా నమిలి నెమ్మదిగా తినడం వల్ల శరీరానికి సరైన సమయంలో తృప్తి సంకేతం అందుతుంది. టీవీ లేదా మొబైల్ చూస్తూ తినడం మానుకోవడం, భోజనాల మధ్య చిన్న విరామాలు తీసుకోవడం, కొద్దికొద్దిగా నీరు త్రాగడం మంచి అలవాట్లు. అలాగే క్రమబద్ధమైన సమయాల్లో భోజనం చేయడం, పరిమితంగా ఆహారం తీసుకోవడం ఈ అలవాటును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం తీసుకోవడం, పుష్కలంగా నీరు త్రాగడం, జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండడం, క్రమం తప్పని వ్యాయామం చేయడం, తగినంత నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం వంటి మంచి అలవాట్లను పాటించడం అవసరం.
గమనిక : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య సలహాగా పరిగణించకండి. ఆహారంలో మార్పులు చేయడానికి ముందు డాక్టర్లను సంప్రదించండి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!