

ఇటీవల తల్లిదండ్రులు చిన్న పిల్లలకు ఫోన్లు, ట్యాబ్‌లు, ల్యాప్‌టాప్‌లు ఇవ్వడం సాధారణంగా మారింది. దీంతో స్క్రీన్‌లు పిల్లల దైనందిన జీవితంలో భాగమవుతున్నాయి. అయితే అధిక స్క్రీన్ సమయం పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మాటలు ఆలస్యంగా రావడం, సంభాషణ నైపుణ్యాలు తగ్గడం వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని చెబుతున్నారు. చండీగఢ్‌లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER) నిర్వహించిన అధ్యయనంలో, ప్రతిరోజూ గంటకు పైగా స్క్రీన్‌లను ఉపయోగించే 18 నుండి 24 నెలల వయస్సు గల పిల్లల్లో మాటల అభివృద్ధి ఆలస్యం అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు వెల్లడైంది.
నిపుణుల ప్రకారం, పిల్లల మెదడు అభివృద్ధికి తొలి రెండేళ్లు అత్యంత కీలకం. ఈ సమయంలో స్క్రీన్‌లకు ఎక్కువగా అలవాటు చేయడం మానసిక వికాసం, భాషా నైపుణ్యాలపై ప్రభావం చూపుతుంది. అందుకే 18 నెలల లోపు పిల్లలను స్క్రీన్‌లకు దూరంగా ఉంచాలని సూచిస్తున్నారు. 2 సంవత్సరాల లోపు పిల్లలకు స్క్రీన్ సమయాన్ని పూర్తిగా నివారించడం ఉత్తమమని, అవసరమైతే మాత్రమే వీడియో కాల్స్‌కు పరిమితం చేయాలని చెబుతున్నారు. పిల్లలను కార్టూన్లు లేదా ఇతర వినోదాలతో నిమగ్నం చేయడానికి స్క్రీన్‌లను ఉపయోగించడం మొదట సులభంగా అనిపించినా, భవిష్యత్తులో దాని ప్రభావం స్పష్టంగా కనిపించే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!