

ఇటీవలి కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య వేగంగా పెరుగుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి పాటించడం దీనికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అయితే ప్రతిరోజూ నారింజ పండ్లు తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్యను నియంత్రించవచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది. న్యూట్రియెంట్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఈ పరిశోధనలో 30 నుండి 65 సంవత్సరాల వయస్సు గల 60 మందిపై పరీక్షలు నిర్వహించారు. వారిలో సగం మందికి నాలుగు వారాల పాటు రోజూ సుమారు 400 గ్రాముల గింజలు లేని నారింజ పండ్లు ఇచ్చారు. ఈ బృందంలో కాలేయంలోని కొవ్వు తగ్గడంతో పాటు, లివర్ ఆరోగ్యం మెరుగుపడిన సంకేతాలు కనిపించాయి.
గింజలు లేని నారింజలను సాధారణంగా నావెల్ ఆరెంజెస్ అని పిలుస్తారు. ఇవి తీపి రుచితో ఉండటంతో పాటు విటమిన్ సి, పాలీఫెనాల్స్ వంటి పోషకాలు సమృద్ధిగా కలిగి ఉంటాయి. ఇవి జీవక్రియను మెరుగుపరచడంలో, కాలేయం చుట్టూ ఉన్న కొవ్వును తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే వీటిలోని యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ శరీర నిర్విషీకరణ ప్రక్రియకు తోడ్పడి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే కేవలం నారింజ పండ్లు మాత్రమే ఫ్యాటీ లివర్‌ను పూర్తిగా నయం చేస్తాయని భావించకూడదని నిపుణులు సూచిస్తున్నారు. మన దేశంలో కూడా ఈ పండ్లు అందుబాటులో ఉన్నాయి. వైద్యుల సలహా మేరకు ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ఉన్నవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. జ్యూస్ రూపంలో కాకుండా పండును నేరుగా తినడం మంచిది. మధుమేహం ఉన్నవారు మాత్రం మితంగా తీసుకోవాలి. సమతుల్య ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు నారింజ పండ్లు తీసుకోవడం కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!