
.jpg&w=3840&q=75)
మానవ శరీరంలోని కణాలు కేవలం భౌతికంగా తాకకుండా కూడా పరిసరాలను అనుభూతి చెందగలవని తాజా అధ్యయనం వెల్లడించింది. కణజాలాలు, ఎముకలు, అవయవాల వంటి నిర్మాణాలను నేరుగా స్పర్శించకుండానే గుర్తించే సామర్థ్యం కణాలకు ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ముఖ్యంగా క్యాన్సర్ కణాలు తమకు 10 మైక్రాన్ల దూరంలో ఉన్న నిర్మాణాలను కూడా గుర్తించగలవని, సాధారణ కణాలు సమిష్టిగా పనిచేస్తే 100 మైక్రాన్ల దూరం వరకు కూడా పరిసరాలను పసిగట్టగలవని అధ్యయనం సూచించింది. ఈ పరిశోధనను అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు.
ఈ ప్రత్యేక సామర్థ్యాన్ని పరిశోధకులు “డెప్త్ మెకానో సెన్సింగ్”గా పేర్కొన్నారు. వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్‌కు చెందిన ప్రొఫెసర్ అమిత్ పాఠక్ ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించారు. ఆయన వివరించిన దాని ప్రకారం, కణాలు తమ చుట్టూ ఉన్న కొలాజెన్ ఫైబర్లను నెట్టడం ద్వారా సమీపంలో ఉన్నది మెత్తని కణజాలమా, గట్టిగా ఉండే ఎముకా, లేదా కణితా అన్న విషయాన్ని అంచనా వేస్తాయి. ఈ విధంగా అవి తమకు అనుకూలమైన మార్గంలో కదలిక కొనసాగిస్తాయి.
క్యాన్సర్ కణాలు కూడా ఇదే సామర్థ్యాన్ని ఉపయోగించి కణితి నుంచి బయటకు వ్యాపిస్తున్నాయని పరిశోధనలో వెల్లడైంది. అవి పరిసరాలను ముందుగానే అంచనా వేసుకుని కణజాలాల్లోకి చొరబడుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ సామర్థ్యాన్ని నియంత్రించగలిగితే క్యాన్సర్ వ్యాప్తిని అడ్డుకునే అవకాశం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ దిశగా మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!