

తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు అందించే పండ్లలో జామకాయకు ప్రత్యేక స్థానం ఉంది. విటమిన్ సి, ఎ, బి, కె లతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ పండును “పేదవాని ఆపిల్” అని కూడా అంటారు. అయితే జామకాయను తొక్కతో తినాలా లేదా తొక్క తీసి తినాలా అనే సందేహం చాలామందికి ఉంటుంది. ఈ విషయంపై ప్రముఖ పోషకాహార నిపుణురాలు దీప్షిక మాట్లాడుతూ, జామకాయను తొక్కతో పాటు తినడమే ఆరోగ్యానికి మంచిదని తెలిపారు. జామ తొక్కలో పొటాషియం, జింక్, విటమిన్ సి వంటి సూక్ష్మపోషకాలు అధికంగా ఉండి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతాయని ఆమె వివరించారు.
అధిక రక్తపోటు, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా జామకాయ ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా తొక్క తీయకుండా తినడం వల్ల ఇందులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే జామకాయ, జామపండు రెండింటిలోనూ పోషకాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య అవసరాలను బట్టి వాటిని ఎంపిక చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బరువు తగ్గాలని భావించే వారు, దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలనుకునే వారు దోర జామకాయను తీసుకోవడం మంచిదని చెబుతున్నారు.
మరోవైపు పండిన జామపండు మృదువుగా, తియ్యగా ఉండటం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు సులభంగా తినగలుగుతారు. ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లను సమృద్ధిగా అందిస్తుంది. వృద్ధులు జామను ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు శరీరంలో వాపులు, మంటను తగ్గించి గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతాయి. మొత్తంగా జామకాయను ఎలా తిన్నా ఆరోగ్యమే అయినప్పటికీ, మీ శరీర తత్వం మరియు ఆరోగ్య పరిస్థితులను బట్టి కాయను లేదా పండును ఎంచుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!