

తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశముందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండాకాలం ప్రారంభం కాగానే చాలా మంది “శరీరంలో వేడి చేసింది” అనే సమస్యను ప్రస్తావిస్తుంటారు. అయితే ఇది ప్రత్యేకంగా ఒక వ్యాధి కాదు; వ్యక్తిగత శరీర తత్వం మరియు బేసల్ బాడీ టెంపరేచర్లో ఉండే స్వల్ప మార్పుల వల్ల కలిగే భావన మాత్రమే. కొందరి శరీరాలు సహజంగానే కొద్దిగా వేడిగా ఉంటాయి. ఈ వేడి కారణంగా జలుబు, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటీ, మూత్రంలో మంట, చర్మంపై దద్దుర్లు, మొటిమలు, మలబద్ధకం వంటి లక్షణాలు కనిపించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఎండాకాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
శరీర వేడిని తగ్గించుకోవాలంటే తగినంత ద్రవ పదార్థాలు తీసుకోవడం అత్యంత ముఖ్యం. రోజుకు కనీసం మూడు లీటర్ల నీటిని ఒకేసారి కాకుండా తరచుగా కొద్దికొద్దిగా తాగడం మంచిది. నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, నిమ్మరసం, సబ్జా గింజలు కలిపిన పానీయాలు, చెరుకు రసం వంటి సహజ శీతల పానీయాలు తీసుకోవడం ద్వారా శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఇవి మలబద్ధకం, చర్మ సమస్యలు, యూరిన్ ఇన్ఫెక్షన్లు వంటి వేడి సంబంధిత సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే బీరకాయ, సొరకాయ వంటి నీటి శాతం అధికంగా ఉన్న కూరగాయలు, కర్బూజ మరియు పుచ్చకాయ వంటి పండ్లు తీసుకోవడం మంచిది. అయితే అధిక చక్కెర కలిగిన పండ్లు మరియు డీప్ ఫ్రైడ్, మసాలా, జంక్ ఫుడ్స్‌ను తగ్గించాలి. కూల్ డ్రింక్స్, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లు శరీర వేడిని మరింత పెంచుతాయి కాబట్టి వీటిని పూర్తిగా నివారించడం ఉత్తమం.
మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల మధ్య ఎండ తీవ్రత ఎక్కువగా ఉండేందున ఈ సమయంలో బయటకు వెళ్లకుండా ఉండటం మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే గాగుల్స్, క్యాప్‌లు, స్కార్ఫ్‌లు, గొడుగులు వంటివి ఉపయోగించి సూర్యరశ్మి నుంచి రక్షణ పొందాలి. అరికాళ్లకు నూనెతో మసాజ్ చేయడం రక్తప్రసరణను మెరుగుపరచి శరీర వేడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మంపై దద్దుర్లు లేదా మొటిమలు వచ్చినప్పుడు రసాయన క్రీముల బదులు చందనం పూతను ఉపయోగించడం మంచిది. జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మూత్రంలో తీవ్రమైన మంట, తరచూ ఇన్ఫెక్షన్లు లేదా అధిక ఎసిడిటీ సమస్యలు తగ్గకపోతే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ సమస్యల వల్ల కూడా శరీర వేడి అధికంగా అనిపించవచ్చు కాబట్టి అవసరమైతే పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫ్రిజ్ నీటి బదులు సాధారణ ఉష్ణోగ్రతలోని నీరు లేదా మట్టి కుండలోని నీటిని తాగడం ద్వారా సహజ చల్లదనం పొందుతూ ఎండాకాలంలో ఆరోగ్యంగా ఉండవచ్చు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనికి మేము ఎలాంటి బాధ్యత వహించము. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని లేదా న్యూట్రిషనిస్ట్‌ను సంప్రదించి వారి సలహా మేరకు అనుసరించండి.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!