

ప్రస్తుతం బాలీవుడ్‌లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్‌లలో ‘డాన్ 3’ ఒకటి. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటనలు ఇంకా రాకపోయినా, రోజుకో కొత్త వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర నుంచి రణ్‌వీర్ సింగ్ తప్పుకున్నారని ప్రచారం జరిగింది. దీంతో దర్శకుడు ఫర్హాన్ అక్తర్ మరియు రణ్‌వీర్ సింగ్ మధ్య విభేదాలు తలెత్తాయని బాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.
తాజా సమాచారం ప్రకారం, ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్న నేపథ్యంలో రణ్‌వీర్ సింగ్ రూ.10 కోట్లు తిరిగి ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన తదుపరి చిత్రం ‘ప్రళయ్’లో ఫర్హాన్ అక్తర్ నిర్మాణ సంస్థకు వాటా ఇవ్వడానికీ అంగీకరించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశాలపై ఫర్హాన్ అక్తర్ గానీ, రణ్‌వీర్ సింగ్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
బాలీవుడ్ అగ్ర హీరోలు అమితాబ్ బచ్చన్, షారుక్‌ఖాన్‌లకు (Shah Rukh Khan) ‘డాన్’ సిరీస్ సినిమాలు అద్భుతమైన విజయాలను అందించాయి. వాళ్లని స్టార్ హీరోలుగా ఓ మెట్టు ఎక్కించాయి. దీంతో దీని సీక్వెల్‌పై ఆసక్తి నెలకొంది. అయితే రణ్‌వీర్ వైదొలిగిన తర్వాత ఆయన స్థానంలో హృతిక్ నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ నటుడి టీమ్ వాటిని ఖండించింది. ఈ ప్రాజెక్ట్ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని హృతిక్ ఇటీవల స్పష్టంచేశారు. దీంతో ‘డాన్ 3’లో ఎవరు నటిస్తారనే దానిపై సందిగ్ధత నెలకొంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!