

నందమూరి బాలకృష్ణ కొత్త సినిమా గురించి ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చకు వచ్చింది. గతంలో వీర సింహా రెడ్డి వంటి హిట్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు గోపీచంద్ మలినేనితో కలిసి మరో సినిమా చేయడానికి నందమూరి బాలకృష్ణ సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్డ్రాప్లో రూపొందించాలని అనుకున్నారట. అయితే భారీ బడ్జెట్ అవసరం కావడంతో ఆ ఆలోచనను పక్కనపెట్టి, సాధారణ కమర్షియల్ కథతో సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇదిలా ఉండగా, ఈ సినిమాలో విలన్ పాత్ర గురించి ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. మంచు కుటుంబానికి చెందిన నటుడు మంచు మనోజ్ ఈ సినిమాలో ప్రతినాయక పాత్రలో నటించేందుకు ఒప్పుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు హీరోగా అనేక సినిమాల్లో నటించిన మనోజ్, ఇటీవల కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు కూడా చేస్తూ కొత్తగా కనిపిస్తున్నాడు. ఆయన ఇప్పటికే మిరాయ్ సినిమాలో ప్రతినాయకుడిగా నటించి మంచి గుర్తింపు పొందాడు. ఇప్పుడు హీరోగా రెండు సినిమాలు చేస్తున్నప్పటికీ, బాలయ్య సినిమాలో విలన్గా కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని సమాచారం.
గతంలో ఊ కొడతారా ఉలిక్కి పడతారా సినిమాలో మనోజ్ హీరోగా నటించగా, బాలకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరూ ఒకే సినిమాలో కనిపించబోతున్నారని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. ఈసారి వీరిద్దరూ వెండితెరపై ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడి పోరాడే పాత్రల్లో కనిపించబోతున్నారని అంటున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. త్వరలోనే మనోజ్ పాత్రపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!