

‘ఓజీ (They Call Him OG)’ లాంటి భారీ హిట్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్ నెలలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల విడుదలైన ‘దేఖ్లేంగే సాలా’ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే, ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేయబోతున్నాడనే విషయంపై ఫ్యాన్స్‌లో ఆసక్తి పెరిగింది.
ఓజీ సీక్వెల్ చేస్తాడని కొందరు, లోకేష్ కనకరాజ్ సినిమాలో నటిస్తాడని మరికొందరు ప్రచారం చేశారు. కానీ తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం, పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో ఒక సినిమా ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు పవన్ కళ్యాణ్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్. ఈ సినిమాకు రామ్ తల్లూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆయన జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కూడా ఇటీవల బాధ్యతలు చేపట్టారు. వ్యాపార రంగం లో ఉన్నత స్థాయిలో ఉన్న రామ్ తల్లూరి, పవన్ కళ్యాణ్ కి కుటుంబ సభ్యుడు లాంటి వాడు.
పవన్ కళ్యాణ్ – సురేందర్ రెడ్డి సినిమా గురించి దాదాపు రెండేళ్ల క్రితమే చర్చలు జరిగాయి. కానీ కొన్ని కారణాల వల్ల ఇది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా సురేందర్ రెడ్డి ఫైనల్ స్క్రిప్ట్ పవన్ కళ్యాణ్‌కు వినిపించగా, ఆయనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ సినిమా కూడా ఓజీ తరహాలోనే యాక్షన్ జానర్లో తెరకెక్కనుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ లుక్ ఈ సినిమాకేనా అనే చర్చ సోషల్ మీడియాలో సాగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రాలేదు. కొత్త సంవత్సరం సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇదే కాకుండా పవన్ కళ్యాణ్ ఓజీ 2, ఓజీ 3, అలాగే దిల్ రాజు బ్యానర్లో ఒక సినిమా, KVN ప్రొడక్షన్స్‌లో మరో సినిమా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. KVN ప్రొడక్షన్స్ సినిమాకు లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించే అవకాశముందని టాక్.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!