

జిల్లా కలెక్టర్ శ్రీమతి ప్రతిమా సింగ్ ఆహ్వానం మేరకు ప్రముఖ నటుడు విష్ణు మంచు మెదక్ జిల్లాలో ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా చారిత్రక ప్రాధాన్యం కలిగిన మెదక్ కోట, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల దుర్గాభవాని ఆలయం, ప్రపంచ ప్రసిద్ధి చెందిన మెదక్ కేథడ్రల్‌ను సందర్శించి అక్కడి చరిత్ర, సంస్కృతి, ప్రకృతి వైభవాన్ని పరిశీలించారు. జిల్లా అధికారులతో సమావేశమై మెదక్ వారసత్వ సంపద, పర్యాటక అభివృద్ధి అవకాశాలపై చర్చించారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన విష్ణు మంచు, మెదక్ జిల్లాలోని కోటలు, అడవులు, సరస్సులు, దేవాలయాలు, ప్రకృతి అందాలు సినీ చిత్రీకరణకు అత్యంత అనుకూలంగా ఉన్నాయని తెలిపారు. భవిష్యత్తులో తన సినిమాల చిత్రీకరణను ఇక్కడ నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తానని వెల్లడించారు. మెదక్ వారసత్వ సంపదను పరిరక్షించడంతో పాటు ప్రపంచ పర్యాటక పటంలో ఈ ప్రాంతాన్ని ప్రముఖ గమ్యస్థానంగా తీర్చిదిద్దే కార్యక్రమాలకు తనవంతు పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇస్తూ, ప్రతి ఒక్కరూ జీవితంలో కనీసం ఒక్కసారైనా మెదక్‌ను సందర్శించాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, పర్యాటక శాఖ అధికారులు చేస్తున్న కృషిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!