

ఖైరతాబాద్ అనగానే భారీ గణపతి ప్రతిమ గుర్తుకొస్తుంది. గణేశ్ నిమజ్జనం రోజున లక్షలాది మంది భక్తుల మధ్య భారీ ట్రక్ (టస్కర్)పై గణేశుడి విగ్రహాన్ని శోభాయాత్రగా ట్యాంక్‌బండ్ వైపు తరలిస్తారు. ఇంతటి భారీ జనసందోహం మధ్య టస్కర్‌ను అత్యంత జాగ్రత్తగా, నైపుణ్యంతో నడపాల్సి ఉంటుంది. అలాంటి అనుభవజ్ఞులైన డ్రైవర్లలో ఆత్మకూర్ (ఎస్) మండలం ముక్కుడుదేవులపల్లికి చెందిన మందడి వెంకటరెడ్డి ఒకరు.
వెంకటరెడ్డి విజయవాడ ఎస్టీసీ ట్రాన్స్‌పోర్టులో 26 ఏళ్లుగా డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. తన అనుభవంతో 2017లో తొలిసారి ఖైరతాబాద్ గణేశుడి నిమజ్జన శోభాయాత్రలో విగ్రహాన్ని తరలించే టస్కర్‌ను నడిపే అవకాశం ఆయనకు లభించింది. అనంతరం 2020, 2025లోనూ ఇదే బాధ్యతను నిర్వర్తించారు. తాజాగా 2026లోనూ అవకాశం దక్కింది. శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యే ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్రలో విగ్రహాన్ని మోసే ట్రక్‌ను వెంకటరెడ్డి నడపనున్నారు. గణేశుడి కృపతోనే తనకు నాలుగుసార్లు ఈ అవకాశం లభించిందని, ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!