

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అమెరికాలో నవంబర్ 3న జరిగే మిడ్‌టర్మ్ ఎన్నికల తర్వాత ఇరాన్‌పై కొత్తగా సైనిక దాడులు జరిగే అవకాశం ఉందని అమెరికా పశ్చిమాసియాలోని తన మిత్రదేశాలను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ దాడులు కొన్ని రోజుల పాటు కొనసాగవచ్చని ఇద్దరు దౌత్యవేత్తలను ఉటంకిస్తూ వార్తలు పేర్కొన్నాయి. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. అమెరికా దాడులు జరిగితే గల్ఫ్ దేశాల్లోని మౌలిక సదుపాయాలపై ఇరాన్ ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజా కథనాలపై వైట్‌హౌస్ లేదా అమెరికా అధికారులు అధికారికంగా స్పందించలేదు.
మరోవైపు, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ దౌత్య ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గత నెల ప్రతిపాదించిన అంశాలపై మధ్యవర్తులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎక్స్‌లో పేర్కొన్నారు. ఘర్షణలు మళ్లీ చెలరేగకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టాలని యూఏఈ విదేశాంగ శాఖ ఇరుపక్షాలను కోరింది. ఇదిలా ఉండగా, ఇరాన్‌పై దాడుల అవకాశాలపై వార్తలు వెలువడుతున్న సమయంలో అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్, జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్‌లో ప్రణాళికలు, వ్యూహాల విభాగానికి నేతృత్వం వహిస్తున్న ఆర్మీ లెఫ్టినెంట్ జనరల్ బ్రెట్ సిల్వియాను పదవి నుంచి తొలగించినట్లు కథనాలు తెలిపాయి. ఇదే స్థానంలో గతంలో పనిచేసిన లెఫ్టినెంట్ జనరల్ జోసెఫ్ మెక్‌గీ గత అక్టోబర్‌లో రాజీనామా చేసిన విషయం గమనార్హం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!