

అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న సవన్నా రివర్ సైట్‌లో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అణు పరిశోధనలకు సంబంధించిన కేంద్రం కావడంతో రేడియోధార్మిక కాలుష్యం వ్యాపించే అవకాశం ఉందన్న ముందుజాగ్రత్తతో అధికారులు అత్యవసర చర్యలు చేపట్టారు. సాయంత్రం సుమారు 5:39 గంటలకు అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రాంగణానికి వెళ్లే రహదారులను తాత్కాలికంగా మూసివేయడంతో పాటు సమీప రవాణాపై ఆంక్షలు విధించినట్లు నివేదిక పేర్కొంది. అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షించాయి. సంబంధిత రాష్ట్ర, స్థానిక అధికారులకు కూడా సమాచారం అందించారు.
అగ్నిమాపక సిబ్బంది సుమారు రెండు గంటల్లో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రభావిత భవనం వెలుపల రేడియోధార్మిక కాలుష్యం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు గుర్తించలేదని అధికారులు తెలిపారు. దీంతో అదే రోజు రాత్రి సుమారు 9:45 గంటలకు అత్యవసర పరిస్థితిని ముగించి, మూసివేసిన మార్గాలను తిరిగి తెరిచారు. ఉద్యోగులు తిరిగి విధులకు హాజరయ్యేందుకు అనుమతించారు. అయితే, మంటలు ఎలా చెలరేగాయి, ఈ ఘటనలో ఎవరైనా గాయపడ్డారా అనే వివరాలు వెల్లడించలేదు. రేడియోధార్మిక పదార్థాలు ఉన్న ప్రాంతాల్లో అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు వాటి ప్రభావాన్ని క్షుణ్ణంగా అంచనా వేయడం అత్యంత కీలకమని అణు భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. భవనం వెలుపల కాలుష్యం గుర్తించలేదన్న సమాచారం ఊరటనిచ్చినప్పటికీ, ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!