

ఇరాన్ వద్ద ప్రస్తుతం ఎన్ని క్షిపణులు అందుబాటులో ఉన్నాయో కచ్చితంగా అంచనా వేయడం అమెరికా నిఘా సంస్థలకు సవాలుగా మారింది. అమెరికాకు చెందిన వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్ వద్ద ప్రస్తుతం 1,500 నుంచి 2,500 వరకు క్షిపణులు యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లు అమెరికా నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంచనాలో కనిష్ఠ సంఖ్యను పరిగణనలోకి తీసుకున్నా, యుద్ధం ప్రారంభమైన సమయంలో ఇరాన్ వద్ద ఉన్న మొత్తం క్షిపణుల నిల్వల్లో ఇది గణనీయమైన భాగమే అవుతుంది. దీంతో ఇరాన్ ఇప్పటికీ భారీ స్థాయిలో దాడులు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉందనే విషయం స్పష్టమవుతోంది. సీఐఏ మాజీ విశ్లేషకుడు, కింగ్స్ కాలేజ్ లండన్‌కు చెందిన ఓ పరిశోధకుడు కూడా రహస్య సమాచారాన్ని విశ్లేషించినప్పటికీ ఇరాన్ వద్ద ఉన్న మొత్తం క్షిపణుల సంఖ్యను కచ్చితంగా నిర్ధారించడం కష్టమని పేర్కొన్నట్లు సమాచారం.
యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్ వద్ద సుమారు 2,500 క్షిపణులు ఉన్నాయంటూ వివిధ నివేదికలు పలుమార్లు వెల్లడించాయి. అయితే, ఈ మధ్యకాలంలో ఇరాన్ వందల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించినప్పటికీ, అమెరికా, ఇజ్రాయెల్ నిఘా వర్గాల అంచనాల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదని కథనం పేర్కొంది. ఇరాన్‌లోని రహస్య భూగర్భ స్థావరాలు ఈ విషయంలో పశ్చిమ దేశాల నిఘా సంస్థలకు ప్రధాన సవాలుగా మారాయి. ఈ స్థావరాల్లో క్షిపణులను నిల్వ ఉంచే అవకాశం ఉండటంతో వాటి మొత్తం సంఖ్యను గుర్తించడం కష్టమవుతోంది. మరోవైపు, అమెరికా భారీ స్థాయిలో దాడులు చేసినప్పటికీ ఇరాన్ ప్రతి నెలా సుమారు 50 బాలిస్టిక్ క్షిపణులను తయారు చేస్తున్నట్లు నిఘా వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇరాన్ వద్ద షాహిద్ శ్రేణికి చెందిన వేలాది ఆయుధాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!