

బ్రిటన్‌లో ప్రమాదకరంగా స్పోర్ట్స్ కార్లతో రేసింగ్‌కు పాల్పడి ఓ తల్లి, ఆమె నాలుగేళ్ల కుమార్తె మరణానికి కారణమైన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు న్యాయస్థానం మొత్తం 28 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కార్ల విక్రయదారుడిగా పనిచేస్తున్న జస్కమల్ రియాత్ (37)కు 16 ఏళ్లు, హర్దీప్ భచ్చు (29)కు 12 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. 2023 జనవరిలో ఉత్తర ఇంగ్లాండ్‌లోని స్కాట్ హాల్ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. జస్టినా హుల్బోజ్ (27), ఆమె కుమార్తె లెనా (4) పాఠశాలకు వెళ్తుండగా.. హర్దీప్ భచ్చు నడుపుతున్న ఆడి టిటి ఆర్‌ఎస్ కారు అదుపుతప్పి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో తల్లీకూతుళ్లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల దర్యాప్తులో ప్రమాదానికి ముందు జరిగిన పరిణామాలు వెలుగులోకి వచ్చాయి. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద తొలిసారి కలుసుకున్న జస్కమల్, హర్దీప్ తమ స్పోర్ట్స్ కార్ల సామర్థ్యం గురించి మాట్లాడుకుని రేసింగ్‌కు దిగినట్లు దర్యాప్తులో వెల్లడైంది. గంటకు 40 మైళ్ల వేగ పరిమితి ఉన్న రోడ్డుపై హర్దీప్ సుమారు 90 మైళ్ల వేగంతో కారు నడిపినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ, డ్యాష్‌క్యామ్ ఫుటేజీల్లో నమోదయ్యాయి. కేసును విచారించిన న్యాయమూర్తి రే సింగ్.. ప్రజలు రాకపోకలు సాగించే రహదారులు రేసింగ్ ట్రాక్‌లు కావని, నిర్లక్ష్యంగా వేగంగా వాహనాలు నడపడం ప్రాణాంతక పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. జైలు శిక్షతో పాటు ఇద్దరి డ్రైవింగ్ లైసెన్స్‌లను ఆరేళ్లపాటు రద్దు చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!