

తుఫాన్ ప్రభావంతో రాజమహేంద్రవరం నగరంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం హైటెక్ బస్టాండ్, నారాయణపురం సహా పలు ప్రాంతాల్లో ఆయన విస్తృతంగా పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. భారీ వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలవకుండా మోటర్ల సాయంతో వెంటనే తొలగించాలని, కూలిన చెట్లను జాప్యం లేకుండా తొలగించాలని సూచించారు.
మంగళవారం సాయంత్రం నుంచి ఇప్పటివరకు సిబ్బంది, క్రేన్ల సహాయంతో సుమారు 20 కూలిన చెట్లను తొలగించినట్లు అధికారులు కమిషనర్‌కు వివరించారు. ఈదురుగాలుల కారణంగా మరిన్ని చెట్లు కూలే అవకాశం ఉన్నందున అవసరమైన యంత్రాలు, సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. పారిశుధ్య పనులను కూడా నిరంతరాయంగా కొనసాగించాలని సూచించారు. తుఫాన్ తీవ్రత తగ్గే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ హెచ్చరికలు, అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం నగరపాలక కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని పర్యవేక్షించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!