

ఆంధ్రప్రదేశ్‌పై అర్నబ్ తుఫాన్ ప్రభావం, రాష్ట్రంలో జరిగిన నష్టంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. తుఫాన్ కారణంగా పంటలు, ఇళ్లు, రహదారులు, విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయని వివరించారు. నష్టాన్ని త్వరితగతిన అంచనా వేసేందుకు వీలైనంత త్వరగా కేంద్ర బృందాలను రాష్ట్రానికి పంపించాలని కోరారు. తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా 14 జిల్లాల్లో 16 ఎన్డీఆర్‌ఎఫ్, 11 ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలను నియమించినట్లు తెలిపారు. 28 వేల మందికి పైగా ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించామని, ప్రభుత్వం చేపట్టిన ముందస్తు చర్యల వల్ల ఇప్పటివరకు ప్రాణనష్టం నమోదు కాలేదని లేఖలో పేర్కొన్నారు.
ప్రాథమిక అంచనాల ప్రకారం 180 ఇళ్లు దెబ్బతిన్నాయని, రహదారులపై 220కి పైగా చెట్లు కూలిపోయాయని చంద్రబాబు తెలిపారు. భారీ వర్షాల కారణంగా సుమారు 70,900 హెక్టార్లలో వరి పంట నీట మునిగిందని, 10,450 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని వెల్లడించారు. కోనసీమ, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అనకాపల్లి, కృష్ణా జిల్లాల్లో తుఫాన్ ప్రభావం అధికంగా ఉందని వివరించారు. విద్యుత్, తాగునీటి సరఫరా పునరుద్ధరణతో పాటు సహాయక చర్యలను వేగవంతం చేసినట్లు తెలిపారు. నష్టంపై సమగ్ర అంచనా పూర్తయ్యాక కేంద్రానికి నివేదిక సమర్పిస్తామని, ఎన్డీఆర్‌ఎఫ్ సహా కేంద్ర సంస్థల సహకారం కొనసాగించాలని కోరుతూ, రాష్ట్రానికి అందిస్తున్న సహకారానికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!