

రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన టెలికాం, డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్‌లో లిస్టింగ్ రోజున మంచి ప్రదర్శన కనబరిచినట్లు సమాచారం. ఈ సందర్భంగా రిలయన్స్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ వారసులు ఆకాశ్, ఈశా, అనంత్ సంస్థ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ మాట్లాడటంతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు. దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా పేర్కొన్న ఈ ఇష్యూకు మదుపరుల నుంచి విశేష స్పందన లభించిందని ఆకాశ్ అంబానీ తెలిపారు. కేవలం 95 నిమిషాల్లోనే పూర్తి సబ్‌స్క్రిప్షన్ లభించిందని పేర్కొంటూ పెట్టుబడిదారులకు కృతజ్ఞతలు తెలిపారు. విదేశాల్లో చదువు పూర్తిచేసుకుని వచ్చిన తర్వాత జియోతో తన కెరీర్ ప్రారంభమైందని, డిజిటల్ భారత్ లక్ష్యంతో తండ్రితో కలిసి పనిచేశానని గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా కేరళంలోని పర్వత ప్రాంతంలో నివసించే అంజలి అనే బాలిక ఉదాహరణను వివరించారు. ఒకప్పుడు తల్లి ఫోన్‌లో పాఠాలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆమె రోజూ రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చేదని, జియో కనెక్టివిటీ అందుబాటులోకి రావడంతో ఇంటి నుంచే చదువుకునే అవకాశం లభించిందని తెలిపారు.
ఈశా అంబానీ మాట్లాడుతూ.. 1977లో రిలయన్స్ తొలిసారి ఐపీఓకు వచ్చిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నారు. అప్పటికి 20 ఏళ్ల వయసున్న ముకేశ్ అంబానీ ఆ ప్రక్రియలో భాగమయ్యారని, ధీరూభాయ్ అంబానీ నాయకత్వంలో రూ.2.8 కోట్లు సమీకరించిన సంస్థ విలువ అప్పట్లో రూ.10 కోట్లుగా ఉండేదని వివరించారు. జియో కేవలం దశాబ్ద కాలంలోనే గణనీయమైన వృద్ధిని సాధించిందని, ఈ ఏడాది సుమారు 15.5 బిలియన్ డాలర్ల ఆదాయం, 8 బిలియన్ డాలర్ల నికర లాభం ఆర్జించినట్లు పేర్కొన్నారు. తన తాత ధీరూభాయ్ అంబానీ, తండ్రి ముకేశ్ అంబానీ దూరదృష్టి ఈ విజయాలకు పునాది అని ఈశా అన్నారు. అనంత్ అంబానీ మాట్లాడుతూ.. కరోనా సమయంలో పాఠశాలలు మూతపడినా డిజిటల్ కనెక్టివిటీ వల్ల విద్య కొనసాగిందని, కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు అనుసంధానమై ఉండగలిగారని గుర్తుచేశారు. భారత డిజిటల్ అభివృద్ధిలో జియో కీలక పాత్ర పోషించిందని, వినియోగదారులు, మదుపరుల కలలను సాకారం చేయడమే సంస్థ లక్ష్యమని తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!