

తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై మినీ బ్యారేజ్ నిర్మాణానికి కీలక ముందడుగు పడింది. హైదరాబాద్‌లోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య ప్రత్యేక సమావేశం జరిగింది. కొల్పూరు - కొడితికొండ మధ్య సుమారు రూ.700 కోట్ల వ్యయంతో బ్యారేజ్ నిర్మాణానికి ప్రతిపాదనలు చర్చించారు.
ఈ సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, కర్ణాటక చిన్న నీటిపారుదల శాఖ మంత్రి బోస్ రాజ్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వర్షాకాలంలో కృష్ణా జలాలు వృథాగా సముద్రంలో కలవకుండా నిల్వ చేసేందుకు 0.5 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజ్ నిర్మించాలని రెండు రాష్ట్రాలు అంగీకరించినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు ద్వారా రాయచూరు, మక్తల్, మాగనూరు, కృష్ణ మండలాలకు సాగునీరు, తాగునీటి సమస్యలు తగ్గే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
అలాగే జూరాల ప్రాజెక్టుకు మూడు టీఎంసీల నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రజాప్రతినిధులు కర్ణాటక ప్రభుత్వాన్ని కోరారు. జూరాల ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచి అదనపు నీటిని పాలమూరు, జోగులాంబ గద్వాల జిల్లాలకు తరలించే అంశంపైనా సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రణాళిక అమలైతే తాగునీటి సమస్యలతో పాటు వ్యవసాయ అవసరాలకు కూడా పెద్ద ఊరట లభించే అవకాశముందని భావిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!