

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న వలస, ఉద్యోగ విధానాల్లో మార్పులు అక్కడి విశ్వవిద్యాలయాలపై ప్రభావం చూపుతున్నాయి. ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్తున్న భారతీయ, చైనీయ విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. 2025–26 విద్యా సంవత్సరంలో అమెరికాలో భారతీయ విద్యార్థుల సంఖ్య 6 శాతం తగ్గి 3,39,435కు చేరింది. చైనీయ విద్యార్థుల సంఖ్య 4 శాతం తగ్గి 2,54,458గా నమోదైంది. మొత్తంగా అమెరికాలో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 18 శాతం పడిపోయింది. అయితే బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్, ఇటలీ వంటి దేశాల నుంచి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరిగింది. ఓపెన్ డోర్స్ గణాంకాల ప్రకారం గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరికలు 15 శాతం, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరికలు 3 శాతం తగ్గాయి. సుమారు 800 విద్యాసంస్థల్లో విద్యార్థుల చేరికలు 9 శాతం మేర పడిపోగా, కొత్తగా చేరుతున్న అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య 15 శాతం తగ్గింది. అయితే భారతీయుల ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (OPT) ప్రోగ్రామ్ చేరికలు మాత్రం 27 శాతం పెరిగి 1,82,201కు చేరడం గమనార్హం.
అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య తగ్గడం అమెరికా విశ్వవిద్యాలయాల ఆదాయంపైనా ప్రభావం చూపుతోంది. అమెరికా వాణిజ్య శాఖ గణాంకాల ప్రకారం అంతర్జాతీయ విద్యార్థుల ద్వారా అక్కడి విద్యాసంస్థలకు ఏటా సుమారు 57 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతోంది. ట్యూషన్ ఫీజులతో పాటు విద్యార్థులు చేసే వ్యక్తిగత ఖర్చులు కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థకు తోడ్పడుతున్నాయి. విద్యార్థుల చేరికలు తగ్గడంతో పలు విశ్వవిద్యాలయాలు కోర్సుల రద్దు, విలీనం, ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలు చేపడుతున్నాయి. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీ 70 అకడమిక్ ప్రోగ్రామ్‌లను రద్దు చేయడం లేదా విలీనం చేయడం ప్రారంభించింది. పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ కూడా వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టగా, బోస్టన్ యూనివర్సిటీ ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. ప్రతిభావంతులైన అంతర్జాతీయ విద్యార్థులను కోల్పోవడం అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుందని ఒహాయో స్టేట్ యూనివర్సిటీ అధ్యక్షుడు రవి వి. బెల్లంకొండ న్యూయార్క్ టైమ్స్‌తో పేర్కొన్నారు. ప్రస్తుతం పలువురు విద్యార్థులు ఉన్నత విద్య కోసం ఐరోపా, ఆస్ట్రేలియా వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!