

ప్రముఖ వ్యాపారవేత్త, టాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ మడుగుల భార్య దీప్తి రెడ్డి మడుగుల బ్రెయిన్‌డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ‘అద్వైతం’, ‘బిల్లా రంగా’, ‘మైనే ప్యార్ కియా’, ‘ఛాంపియన్’ తదితర చిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రదీప్ మడుగుల భార్యగా మాత్రమే కాకుండా, ‘వి ఎయిమ్ ఫౌండేషన్’ వ్యవస్థాపకురాలిగా దీప్తి రెడ్డి సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ భాగస్వామ్యమయ్యారు. రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతున్న సమయంలో పరిస్థితి విషమించడంతో వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించారు. ఈ విషాద సమయంలోనూ ఆమె ఆశయాన్ని గౌరవిస్తూ అవయవదానానికి కుటుంబసభ్యులు అంగీకరించారు. విరాట్ ఫౌండేషన్ సహకారంతో ‘జీవన్‌దాన్’ ద్వారా అవయవదాన ప్రక్రియను ప్రారంభించారు.
దీప్తి రెడ్డి 2026 జూన్ 18న తన అవయవాలను దానం చేస్తానని ప్రతిజ్ఞ చేసినట్లు విరాట్ ఫౌండేషన్ అధ్యక్షుడు యశ్ వీరగొని తెలిపారు. ఆమె కోరికను గౌరవిస్తూ కుటుంబసభ్యులు అవయవదానానికి ముందుకు రావడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. “తీవ్ర విషాదంలోనూ ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు కుటుంబసభ్యులు తీసుకున్న నిర్ణయం ఎంతో గొప్పది. వారి చర్య సమాజానికి ఒక సందేశాన్ని అందించింది” అని యశ్ వీరగొని అన్నారు. సమాజంలో అవయవదానంపై మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, ఇలాంటి మహత్తర కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని విరాట్ ఫౌండేషన్ పిలుపునిచ్చింది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!