

రాఖీ పౌర్ణమి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆగస్టు 27 నుంచి 31 వరకు మొత్తం 5,000 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గతేడాది 4,760 ప్రత్యేక బస్సులు నడపగా, ఈసారి ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 240 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. అవసరమైన ప్రాంతాల్లో రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
ఆగస్టు 30 మధ్యాహ్నం నుంచి 31 వరకు తిరుగు ప్రయాణాల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున అధికారులు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. వరుస సెలవులు, రాఖీ పౌర్ణమి నేపథ్యంలో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటూ రద్దీని పర్యవేక్షిస్తున్నారని, ప్రయాణికుల రాకపోకలు సాఫీగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!