

ఎన్‌ఎండీసీ 14వ మారథాన్ సందర్భంగా ఆగస్టు 30, ఆదివారం హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఫుల్ మారథాన్ (42.195 కి.మీ.), హాఫ్ మారథాన్ (21.097 కి.మీ.), 10 కి.మీ. విభాగాల్లో పోటీలు ఉదయం 5 గంటల నుంచి 11.30 గంటల వరకు జరుగుతాయి. ఫుల్, హాఫ్ మారథాన్‌లు నెక్లెస్ రోడ్‌లోని పీపుల్స్ ప్లాజా నుంచి, 10 కి.మీ. రన్ మాదాపూర్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్ సమీపం నుంచి ప్రారంభమవుతాయి. మూడు మార్గాలు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియం వద్ద కలుస్తాయి.
మారథాన్ రూట్లలో భారీ వాహనాల రాకపోకలను ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిలిపివేయనున్నారు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాలను ఖజాగూడ, నానక్‌రామ్‌గూడ, గోపన్‌పల్లి మీదుగా మళ్లిస్తారు. లింగంపల్లి నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే ట్రాఫిక్‌ను మసీద్‌బండ, బొటానికల్ గార్డెన్, అంజయ్యనగర్, ఓఆర్‌ఆర్ మీదుగా ఖజాగూడ వైపు మళ్లించనున్నారు. కొండాపూర్, కొత్తగూడ నుంచి సైబర్ టవర్స్ వైపు వెళ్లే వాహనాలను అంజయ్యనగర్, రోలింగ్ హిల్స్, దుర్గం చెరువు మీదుగా దారి మళ్లిస్తారు. ఈ సమయంలో నిషేధిత మార్గాల్లో ప్రయాణికుల ఎక్కింపు, దింపివేతలను నివారించాలని క్యాబ్, ఆటో, ట్యాక్సీ నిర్వాహకులకు పోలీసులు సూచించారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!