

నేపాల్, పరిసర ప్రాంతాల్లో వరదల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సహాయక చర్యలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్, సమన్వయ కేంద్రంతో పాటు హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయం హెల్ప్‌లైన్ ద్వారా కుటుంబ సభ్యులు, ఇతరుల నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు సుమారు 80–100 కాల్స్ అందగా, ధ్రువీకరణ అనంతరం 20 కేసుల్లో 23 మందికి సంబంధించిన వివరాలను తదుపరి చర్యల కోసం గుర్తించారు. వీరిలో ఆరుగురు తెలంగాణకు చెందినవారు కాగా, 17 మంది తెలంగాణ మూలాలున్న ఎన్‌ఆర్‌ఐలు. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి సురక్షితంగా ఉన్నట్లు తాజాగా నిర్ధారణ అయింది.
దీంతో మిగిలిన 22 మంది క్షేమ సమాచారం, ఆచూకీపై అధికారులు నిరంతరం ఫాలోఅప్ చేస్తున్నారు. నేపాల్–టిబెట్ ప్రాంతాల్లో ప్రయాణిస్తున్న పలువురి చివరిగా తెలిసిన ప్రదేశాలు రసువా, రసువాగఢి, గ్యిరోంగ్‌గా గుర్తించారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ అధికారులు, రాష్ట్ర సచివాలయం, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ, భారత రాయబార కార్యాలయం, ఇతర సంబంధిత అధికారులతో సమన్వయం చేస్తున్నారు. కుటుంబ సభ్యులు, ట్రావెల్ ఆపరేటర్లు, అధికారిక వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని ధ్రువీకరిస్తూ, అవసరమైన సహాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!