

ఎల్‌నినో నేపథ్యంలో నీటి పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 60 రోజుల పాటు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. మంగళవారం సచివాలయంలో జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ పరిధుల్లో తాగునీటి సరఫరా సన్నద్ధతపై ఆయన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కోర్ ఏరియాకు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, మంజీరా, కృష్ణా, గోదావరి వనరుల ద్వారా ప్రస్తుతం రోజుకు 560 ఎంజీడీల నీరు అందుబాటులో ఉందని అధికారులు వివరించారు. కృష్ణా నది నుంచి 15 ఎంజీడీలు, మిషన్ భగీరథ ద్వారా 40 ఎంజీడీలు, ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ నుంచి చెరో 5 ఎంజీడీల చొప్పున అదనంగా 60 ఎంజీడీల నీటిని వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు.
మల్లన్నసాగర్ పైప్‌లైన్ నిర్మాణం నవంబరులో పూర్తయితే మరో 20 ఎంజీడీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. మంజీరా, సింగూరు రిజర్వాయర్లపై ఆధారపడిన మెదక్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో నీటి లభ్యతను బట్టి ప్రత్యామ్నాయ ప్రణాళిక అమలు చేయనున్నట్లు సీఎస్ తెలిపారు. నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సినీ నటులు, ప్రముఖులు, సెలబ్రిటీలను భాగస్వాములను చేయాలని సూచించారు. సమీక్షలో దానకిశోర్, అశోక్‌రెడ్డి, ఆర్.వి.కర్ణన్, వినయ్ కృష్ణారెడ్డి, సృజన తదితరులు పాల్గొన్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!