

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సవరించిన డీలిమిటేషన్ బిల్లుకు డీఎంకే మద్దతు ప్రకటించడంతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఈ నిర్ణయంపై నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK) తీవ్ర విమర్శలు గుప్పించింది. డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ను ‘సావర్కర్ 2.0’ అంటూ టీవీకే ఐటీ విభాగం ఎక్స్ వేదికగా విమర్శించింది. ఆర్ఎస్ఎస్ యూనిఫామ్‌లో స్టాలిన్ ఉన్నట్లుగా రూపొందించిన చిత్రాన్ని షేర్ చేసింది. మరో పోస్టులో ‘సనాతనం అల్లా.. సన్-ధనం’ అంటూ డీఎంకేపై వ్యంగ్యాస్త్రాలు సంధించింది. గతంలో ఇదే బిల్లును వ్యతిరేకించిన స్టాలిన్ ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కోసం తన వైఖరిని మార్చుకున్నారని ఆరోపించింది. పార్లమెంట్‌లో బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని, లేదంటే ఓటింగ్‌కు దూరంగా ఉండటం లేదా వాకౌట్ చేయడం బీజేపీకి లొంగిపోవడమే అవుతుందని టీవీకే గతంలో సవాల్ విసిరింది.
మరోవైపు, డీఎంకే నిర్ణయాన్ని స్టాలిన్ గట్టిగా సమర్థించుకున్నారు. ఏప్రిల్‌లో బిల్లును వ్యతిరేకించిన సమయంలో తమ పార్టీ లేవనెత్తిన రెండు ప్రధాన డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు లిఖితపూర్వకంగా అంగీకరించిందని వెల్లడించారు. 2024 నుంచి డీఎంకే చేస్తున్న నిరంతర పోరాటానికి, తమిళనాడుతో పాటు దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలకు దక్కిన విజయంగా ఈ పరిణామాన్ని అభివర్ణించారు. ప్రజలు భావోద్వేగాలకు లోనుకాకుండా ప్రతిపాదనను ప్రశాంతంగా పరిశీలించాలని సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంతో పాటు ఆచరణాత్మకంగా ప్రయోజనం చేకూర్చే విధంగా ప్రతిపాదన ఉందని భావించడం వల్లే బిల్లుకు మద్దతు ప్రకటించినట్లు స్టాలిన్ ఎక్స్ వేదికగా వివరించారు. దీంతో డీలిమిటేషన్ బిల్లుపై డీఎంకే, టీవీకేల మధ్య రాజకీయ విమర్శలు మరింత ముదిరాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!